- ఖబ్రస్తాన్ నిర్మాణానికి భూమి కేటాయింపు
- ముస్లింలకు ఇచ్చిన మాట నెరవేర్చడం జరిగింది
- పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మైనారిటీ సంక్షేమానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎం.ఎల్.ఎ. విజయ రమణరావు అన్నారు.
పెద్దపల్లి పట్టణంలోని ఫారన్ మసీద్ లో గురువారం ముస్లింలు సమావేశం నిర్వహించారు.సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గతంలో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన మాట ప్రకారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివారులో ఖబ్రస్తాన్ (స్మశానవాటిక) నిర్మాణం కోసం ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత భూమి కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు.ఖబ్రస్థాన్ కు రెండు ఎకరాల భూమి మంజూరయ్యిందని ప్రకటించారు.అనేకసార్లు అధికారులతో వెంటపడి ముస్లింల కోరిక నెరవేర్చామని పేర్కొన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి ముస్లిం మైనార్టీలు ఖబ్రస్థాన్, షాదీ ఖానా, డిగ్రీ కళాశాల, బైపాస్ రోడ్డు, బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని తెలిపారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల కోరిక, అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు.ఖబ్రస్తాన్, పెద్దపల్లి పట్టణంలో బస్ డిపో మంజూరు చేయించడం జరిగిందని,మార్చి తర్వాత పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.అలాగే బైపాస్ రోడ్డు టెండర్లు పూర్తి అయ్యాయని,మే మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.
ఖాబ్రస్థాన్ కోసం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని 1072 సర్వే నెంబర్ లో రెండు ఎకరాల స్థలం ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే మంత్రిమండలి ఆమోదంతో మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.అలాగే షాదీ ఖానా కోసం పది నుండి 15 గుంటల స్థలం కేటాయించే ప్రయత్నం చేస్తున్నామని,డిగ్రీ కళాశాల నిర్మాణానికి సైతం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంతకుముందు ముస్లిం మైనారిటీ నాయకులు,మత పెద్దలు, ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మున్నూ భాయ్,ఎంఏ హై జావిద్, ఎం ఏ ఖలీల్, ఆరిఫ్, సయ్యద్ మస్రత్, షాకీర్, ఎంఏ మొయిద్, ఇంతియాజ్ ఖాన్,అంజద్ అలీ, ఎండి నాజీమ్, షేక్ అజ్గర్ ఎండి సాజిత్ ఎండి మసూద్ ఎండి కాజా పాషా, అస్లాం, ఎండి ముస్తాక్ జహీర్ అబ్బు రహీముద్దీన్, సర్వర్, మిరాజ్, నదీమ్, ముక్తి ఇస్తే ఖాన్, ఇమ్రాన్ సాహెబ్, ముస్లిం సోదరులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.