Take a fresh look at your lifestyle.

పిలిప్పీన్స్​కు మన బియ్యం

  • కాకినాడ పోర్ట్​ నుంచి బియ్యం నౌక ప్రారంభం.
  • తొలుత 12,500 టన్నులు.
  • మొత్తం 8 లక్షల టన్నులు ఇచ్చేందుకు ఒప్పందం.
  • అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బియ్యం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం బియ్యం ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లే దిశగా ముందడుగు వేసింది. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదరగా.. ఇందులో భాగంగా తొలి విడతలో రూ. 45 కోట్ల విలువైన 12,500 టన్నుల బియ్యం ఎగుమతి చేసే నౌకను సోమవారం కాకినాడ పోర్టులో ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ పోర్టు నుంచి నౌకను జెండా ఊపి పంపించారు. తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం నౌక ద్వారా ఫిలిప్పీన్స్‌కు చేరనుంది. మన రాష్ట్రానికి చెందిన బియ్య విదేశాలకు ఎగుమతి అవుతోంది. తెలంగాణ బియ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సోమవారం బియ్యం లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఫిలిప్పీన్స్‌కు వెళ్లేందుకు సిద్ధమైన నౌకను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్​ మాట్లాడుతూ ఫిలిప్పీన్స్ కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నామని, తొలి విడతగా రూ. 45 కోట్ల విలువైన 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిస్తున్నామన్నారు. ఇతర దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందని, రాష్ట్ర రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని సివిల్ సప్లయి ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదని, స్వయంగా తాను వెళ్లి రైస్ ఎగుమతులు చర్చిస్తామని, తెలంగాణలో వరి రైతులకు మేలు జరిగేలా ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏసియాలో మార్కెట్ ఎక్స్ ప్లోరర్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్‌కు వెళ్లనున్న బియ్యం నౌక తెలంగాణ రైతుల కృషికి గౌరవ సూచకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్టర రైతులు అధిక నాణ్యత కలిగిన బియ్యాన్ని ఉత్పత్తి చేయడంతో ఇతర దేశాలు తెలంగాణ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇటీవల బంగ్లాదేశ్, శ్రీలంక, మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా తెలంగాణ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రైతులకు స్థిరమైన ఆదాయం రావడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతాయని, రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటామని, తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు విధానాన్ని మెరుగుపరిచి, ఎగుమతులను మరింత విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరిన్ని దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతుల అవకాశాలపై చర్చలు కొనసాగుతున్నాయని, రైతులకు మంచి ధర అందించేందుకు, పత్తి, గోధుమ వంటి ఇతర పంటల ఎగుమతులపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. కాకినాడ, విశాఖపట్నం పోర్టుల ద్వారా రైస్ ఎగుమతులను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలకు, అంతర్జాతీయ మార్కెట్‌కి తెలంగాణ బియ్యం రవాణా చేసే ప్రణాళికలు రూపొందించబడుతున్నాయన్నారు. ఈ ఎగుమతుల ఒప్పందంతో తెలంగాణ బ్రాండ్ బియ్యం అంతర్జాతీయంగా పేరుపొందేలా రాష్ట్ర ప్రభుత్వం మరింత కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్​ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.