కోరుట్ల/కథలాపూర్, ముద్ర: ఈ మధ్య ప్రకటించిన గ్రూప్ ఫలితాలలో విజయం సాధించకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కథలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా కథలాపూర్ గ్రామానికి చెందిన ఆకుల శృతి 27 పీజీ వరకు చదువుకుంది. గ్రూప్స్ పరీక్షలను రాసింది. ఈ మధ్య ప్రకటించిన గ్రూప్ పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో, మృతురాలు సంవత్సరం నుండి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో, జీవితంపై విరక్తి చెంది తన ఇంటిలో గల దూలానికి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయినట్లు మృతురాలి తల్లి పేర్కొంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఆకుల రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై జి. నవీన్ కుమార్ తెలిపారు.