ముద్ర కూకట్‌పల్లి :
నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతీ అలివేలుమంగా సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సీనియర్ నాయకులు శ్రీ జోగిపేట్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ అరుణ్ గురుస్వామి చేతుల మీదుగా ధ్వజస్తంభ, శిఖర, రాజగోపుర మరియు నరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అరికెపూడి గాంధీ శ్యామల దేవి హాజరవ్వగా, వారితో పాటు మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం నిర్వహించిన ఈ ప్రతిష్ఠా మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. స్వామి వారి ఆశీస్సులు నిరంతరం ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఈ వేడుకను విజయవంతం చేశారు.