- హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేశారు
- ఇప్పుడు బస్తీల ఇండ్ల మీద పడ్డారు
- రెవెన్యూ, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆగడాలు పెరిగిపోయాయి
- అధికారులు, పోలీసులు మారకపోతే శిక్ష తప్పదు
- కాళేశ్వరం గురించి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళే మాట్లాడుతున్నారు
- వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించడం ఎవరితరం కాదు
- రేపటి శకం బీజేపీదే
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైడ్రా పేరుతో పేదల గూడు చెదరగొట్టాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని ఖబద్దార్ అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. పేదల కోసం ఎంతకు తెగించైనా కొట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదేమీ నిజాం సర్కార్ కాదని , బాస్ ల ఆదేశాల మేరకు పనిచేసే అధికారులు, పోలీసులు మారకపోతే శిక్ష తప్పదన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు.. కాంగ్రెస్ సర్కార్ మూడు నెలలుగా హైడ్రా పేరుతో హంగామా చేస్తోందని ఆయన మండిపడ్డారు. కొన్ని నెలలు మూసీ పక్కన ఉన్న పేదల ఇళ్ళు కూలగొట్టారని, ఇప్పుడు బస్తీల్లో ఉన్న ఇళ్ళ మీద పడ్డారని అన్నారు. దేశంలో అతిపెద్ద, పురాతన మురికివాడలైన బాలాజీనగర్, జవహర్ నగర్ లో పేదలు 1985 నుంచి నివాసం ఉంటున్నారని అన్నారు. ఈ బస్తీలలో తెలంగాణ, ఏపీ, యూపీ, బెంగాల్, బీహార్ లకు చెందిన ప్రజలు ఉంటున్నారని తెలిపారు.
1941 లో సైనికులకోసం ప్రస్తుత బాలాజీనగర్, జవహర్ నగర్ లోని 5977.3 ఎకరాల భూమిని 4 లక్షల యాభై వేలకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సేకరించి ఇచ్చిందని ఎంపీ ఈటల తెలిపారు. ఈ భూమి 1948 వరకు సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ అదీనంలో ఉండేదని, నిజాంపాలన అంతమై స్వాతంత్రం వచ్చాకా, సైనికులకు సొసైటీకీ 1951 ఎంఈవో కు అప్పగించిందన్నారు. అప్పట్లో ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేర్ టేకర్ గా మాత్రమే నియమించారన్నారు. ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, రక్షణ శాఖకు సంబంధించిన భూమి అని ఎంపీ ఈటల వివరించారు. అయితే సైనికులు అమ్ముకుంటే పేదలు కొనుక్కుని గుడిసెలు వేశారన్నారు. ఈ క్రమంలో 1994 గుడిసెలు కూల్చివేయాలని అప్పటి రెవెన్యూ మంత్రి కమతం రామచందర్ అదేశలిస్తే బీజేపీ నేత టైగర్ నరేంద్ర నాయకత్వంలో ఎదురుతిరిగి ఆపేసారని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ఇల్లు కూలగొట్టలని చూస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆగడాలు పెరిగిపోయాయి.
ఎప్పుడు కూలగొడతారో అని భయపడుతున్నారు.1998 అరుంధతి నగర్ లో 1705 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్నవారికి భూములు ఇచ్చారని, ఆ ఇళ్ళను ఇప్పుడు రేవంత్ సర్కార్ కూలుస్తాని బెదిరిస్తుందని ఎంపీ ఈటల ఆరోపించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా ?, అధికారుల మీద మంత్రులకు పట్టు ఉందా లేదా ? అని ఆయన ప్రశ్నించారు. అధికారుల బ్రోకర్ల లాగా మారిపోయి పేదలను వేధిస్తున్నారని, రూ.50 వేల నుండి 2 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. సైనికులకు సంబంధించిన ఈ భూములపై కోర్టుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి మెట్టికాయలు పడ్డాయని అన్నారు. అయినా సరే ప్రభుత్వానికి బుద్ధిరాలేదన్నారు. జవహర్ నగర్, బాలాజీనగర్ మురికివాడల్లో పేజలకు అండగా నిలబడి బీజేపీ నేతలు బద్దం బాల్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఆలే నరేంద్ర ఇండ్లను ఇప్పించారని, ఇప్పుడు ఆ గూడులను చెదరగొట్టాలని ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
ఈ భూములకు సంబంధించి ప్రభుత్వానికి దమ్ముధైర్యం ఉంటే కోర్టులో ఆధారాలు సమర్పించాలని ఆయన సవాల్ విసిరారు. కాళేశ్వరం నోటీసులు మిడిమిడి జ్ఞానం ఉన్నవారు, ప్రోటోకాల్ తెలియనివారు తనపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ ఈటల అన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు విడుదల చేయాల్సిన బాధ్యత ఆర్ధిక శాఖదేననే విషయాన్ని గ్రహించాలన్నారు. బీజేపీలో తన ఎదుగుదల ఇష్టం లేనివారు అబద్ధాలు పుట్టిస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. అలాంటి విమర్శలను తాను పట్టించుకోలని తెలిపారు. మల్గాజిగిరిలో తనను ఓడించడం జేజమ్మ తరం కాలేదన్నారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీని ఓడించడం ఎవరి తరం కాదని, రేవటి తరం బీజేపీదేని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.