- నేటి నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో హాజరు
- పెట్టుబడులే లక్ష్యంగా మల్టీనేషన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ
- ముగిసిన సింగపూర్ పర్యటన
- చివరి రోజుల వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు స్విట్జర్లాండ్ లోని దావోన్ లో పర్యటించనుంది. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో విదేశీ పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం నేటి నుంచి నాలుగు రోజుల పాటు దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది.
మూడు రోజుల సింగపూర్ పర్యటనను ముగించుకున్న సీఎం బృందం.. ఆదివారం రాత్రి దావోస్ కు బయలుదేరి వెళ్లింది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు దావోస్ కు బయల్దేరి వెళ్లారు. కాగా సింగపూర్ పర్యటనలో సీఎం బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు,సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు,చర్చలు జరిపింది.ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్,డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్,డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ,బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ,ఛైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్,మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్ తో చర్చలు జరిపింది.హైదరాబాద్ లో పెట్టుబడులు ఉన్న అవకాశాలు,ప్రభుత్వ విధానాలను వారికి వివరించింది.