Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నూతన విద్యాపాలసీ

జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ బోధన
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి
పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సంస్కరణలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల అభివృద్ధి
సీఎం రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ నివేదిక

ముద్ర, తెలంగాణ బ్యూరో :

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో నూతన విద్యాపాలసీ అమలులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తున్నది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యత మెరుగుదల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల అభివృద్ధి వంటి అంశాల్లో విద్యా సంస్కరణలకు కృషి చేస్తోంది. ఈ మేరకు ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విద్యా పాలసీ తయారీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ గురువారం తన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి , కమిషన్ సభ్యులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావిధానంపైన ‘ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ’ పేరుతో ఉన్న నివేదికను సీఎంకు అందజేశారు. కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇదీలావుంటే జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నామని గతంలోనే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి… అదే సమయంలో విద్యా విధానం కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. దీంతో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, చైర్మన్ గా మరో ఐదుగురు సభ్యులు గా కమిటీ ఏర్పాటు చేస్తూ గతేడాది సెప్టెంబర్ లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెలంగాణ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి ఉన్నారు. కమిటీ నియామకం సమయంలో విద్యాపాలసీపై సీఎం, ప్రభుత్వం ఆయా సభ్యులకు కీలక సూచనలు చేసింది. తెలంగాణ రైజింగ్‌-2027’ లక్ష్యానికి అనుగుణంగా కొత్త విద్యా విధానం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ బోధన, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్క రణలు, పరిశోధనలు, అంతర్జాతీయ అవకాశా లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పారిశ్రామిక రంగానికి, విద్యాసంస్థలకు మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని కోరింది. పాఠశాల విద్య నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు అన్ని స్థాయిల్లో అవసరమైన సంస్కరణ లతో నివేదిన ఇవ్వాలని సూచించింది. కాగా ఇందులో గ్రామాల్లోని ప్రీ-ప్రైమరీ పాఠశాల పిల్లలకు కూడా ఉచిత రవాణాను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నూతన విద్యా విధా నాన్ని 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

Leave A Reply

Your email address will not be published.