- భద్రాద్రి కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : పొగాకు వాడడం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, కోర్ట్ డ్యూటీ పోలీసులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సరిత మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం వుందన్నారు. యువత పొగాకు ఉత్పత్తులు వినియోగించకుండా చూడాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను గమనించాలని సూచించారు. పొగాకు, సిగరెట్, ఆల్కహాల్ వినియోగం వలన గుండె జబ్బులు, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని తెలిపారు. వ్యాధులు సోకిన వారు బలహీన పడి పోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గి పోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె. కిరణ్ కుమార్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రాజమల్లు, పీ.పీ పీవీడీ లక్ష్మి, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాదులు, ఏ.వో జె. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.