Take a fresh look at your lifestyle.

వంట గ్యాస్ కొరత లెదు ప్రజాలెవరూ ఆందోళన చెందొద్దు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

 

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):

జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ సమావేశ మందిరం నందు సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల నిర్వహకులతో జిల్లాలో గ్యాస్ పెట్రోల్, డీజిల్ సరఫరా, వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరాకు ఎటువంటి కొరత లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అనవసర ఆందోళనకు గురికాకుండా, అవసరాన్ని బట్టి సమయానికి గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు తరచుగా అవసరం లేకుండా బుకింగ్‌లు చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై అనవసర ఒత్తిడి ఏర్పడుతుందని తెలిపారు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత, సంబంధిత ఏజెన్సీలు వినియోగదారుల ఇళ్ల వద్దకే సిలిండర్‌ను సరఫరా చేస్తాయని తెలిపారు. ఎవ్వరూ గ్యాస్ ఏజెన్సీలు లేదా గోదాముల వద్దకు స్వయంగా వెళ్లి వేచి ఉండవద్దని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం వినియోగదారుల తేదీ వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్‌ను తప్పనిసరిగా ఇంటి వద్దకే అందజేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కొరత లేదని, ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి కొరత ఉన్నదని సమస్యలు సృష్టించకుండా, అధిక మోతాదులో తీసుకొని ఇండ్లలో నిల్వ చేసుకోవద్దని, దాని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అవసరానికి మాత్రమే తీసుకోవాలని సూచించారు. పెట్రోల్ బంకుల నిర్వహకులు వాహనాలలో మాత్రమే పెట్రోల్, డీజిల్ వేయాలని, క్యాన్స్ లో, బాటిల్స్ లో వేయరాదని, ప్రజలకు అవగాహన కల్పించాలని, స్కూల్, ఆసుపత్రి వంటి ప్రాధాన్యత కలిగిన వాహనాలకు సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని ప్రజలకు గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల నిర్వహకులు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నందున ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సరఫరా సక్రమంగా కొనసాగుతోంది. కాబట్టి ప్రజలు అపోహలు, వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి వనజాత, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు రామేశ్వరి దేవి, కేషు రామ్, వ్యవసాయ శాఖ అధికారి ఉషా, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, పెట్రోల్ బంకుల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.