Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డి. రమాకాంత్ హాజరయ్యారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో ఏకకాలంలో లోక్ అదాలత్ నిర్వహించగా, భూ వివాదాలు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, మోటార్ ప్రమాద కేసులు, బ్యాంకు సంబంధిత కేసులకు రాజీ ద్వారా పరిష్కారం చూపించారు.

ఈ సందర్భంగా జడ్జి డి. రమాకాంత్ మాట్లాడుతూ “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం పొందడంతో పాటు, అప్పీల్‌కు అవకాశం లేకుండా తుది తీర్పు లభిస్తుందని చెప్పారు. దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని తెలిపారు. ఇరువర్గాలు సఖ్యతతో జీవించేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు.

పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి నసీం సుల్తానా మాట్లాడుతూ, పగలు, ప్రతీకారాలు విడిచిపెట్టి రాజీకి రావాలని సూచించారు. సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా త్వరిత పరిష్కారం పొందవచ్చని వివరించారు.

ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,688 కేసులు పరిష్కారం పొందినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్ రావు సహా పలువురు న్యాయవాదులు, కక్షిదారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.