‘కోల్ బెడ్ మిథేన్’అన్వేషణకు సింగరేణికి అవకాశం
19 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్ బెడ్ మిథేన్ అన్వేషణనకు గ్రీన్ సిగ్నల్
వేలంలో పాల్గొనాలని కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖల సూచన
సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతితో ఏడీజీ సచివ్ కుమార్ భేటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
బొగ్గు అన్వేషణ లో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు పొరలలో ఉన్న మిథేన్ గ్యాస్ వనరుల అన్వేషణకు అవకాశం లభించనుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ సింగరేణి ప్రాంతంలో గుర్తించిన మూడు ప్రధాన బ్లాక్ ల అన్వేషణ లో పాల్గొనాలని ఆ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సింగరేణి సీఎండీని కోరారు. శుక్రవారం సాయంత్రం సింగరేణి భవన్ లో సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతిని కలిసి చర్చలు జరిపారు. దేశ వ్యాప్తంగా ఈ వాయువును ఉత్పత్తి చేయడానికి పలు రాష్ట్రాల్లో బ్లాక్ లను గుర్తించారనీ దీనిలో ప్రాణహిత – గోదావరి లోయ ప్రాంతం కూడా ఉందన్నారు. దీనికి సంబంధించి ముందుగా అన్వేషణ జరపడానికి త్వరలో కేంద్ర పెట్రోలియం శాఖ వేలం నిర్వహించబోతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. వీటిలో సింగరేణిలో ప్రాంతంలో ఆరు జిల్లాల్లో మూడు ప్రధాన బ్లాక్‌లను గుర్తించామని చెప్పారు. వీటిలో మంచిర్యాల, పెద్దపల్లి, కొమరమ్ భీమ్, ఒక బ్లాక్‌గా(5 బిలియన్ క్యూబిక్ మీటర్ల వనరులు ), భద్రాద్రి కొత్తగూడెంలో ఒక బ్లాక్ (2 బిలియన్ క్యూబిక్ మీటర్ల), భద్రాద్రి కొత్తగూడెం, ములుగు కలిపి ఒక బ్లాక్‌గా(12 బిలియన్ క్యూబిక్ మీటర్ల) గుర్తించారన్నారు. ఈ బ్లాక్ ల్లో అన్వేషణ జరపడానికి సింగరేణి సంస్థ త్వరలో జరిగే వేలంలో పాల్గొనాలన్నారు. ఈ మూడు బ్లాక్ లలో దాదాపు 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ వనరుల లభ్యత ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉన్నట్లు తెలిపారు. వికసిత్ భారత్ – 2047 లో భాగంగా చమురు, ఇంధన రంగాలను స్వయం సమృద్ధిని సాధించడంలో ఇది ఒక అంతర్భాగ నిర్ణయమని ఆయా శాఖల అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రతిపాదనపై కూలంకశంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సచివ్ కుమార్ పాల్గొన్నారు.