ముద్ర, మహదేవపూర్ :

రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన సమగ్ర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్ నుండి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశించారు. ఘాట్‌ల అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం
వి.ఐ.పి ఘాట్‌లు, పుష్కర ఘాట్‌ల అభివృద్ధి
తాత్కాలిక స్నాన ఘాట్‌ల ఏర్పాటు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ
వైద్య శిబిరాల ఏర్పాట్లపై జిల్లాల వారీగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, నిర్దిష్ట గడువుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.
భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరం వస్తారని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర ప్రణాళికలు, పార్కింగ్ స్థలాల గుర్తింపు, సీసీ కెమెరాల ఏర్పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయాల దర్శన వ్యవస్థ, క్యూలైన్ నిర్వహణ, ప్రత్యేక పూజలు వంటి అంశాలను ముందస్తుగా ప్రణాళికలో చేర్చాలని సూచించారు. భక్తులకు అవసరమైన సమాచారం ప్రచార కార్యక్రమాల ద్వారా అందుబాటులో ఉంచాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం, ఘాట్‌ల వద్ద పరిశుభ్రత, పర్యావరణ హిత చర్యలు అమలు చేయాలని సూచించారు. ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టనున్న ఏర్పాట్ల వివరాలను వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికలు తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్, వైద్య, సమాచార, మిషన్ భగీరథ, దేవాదాయ, పంచాయతి రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.