– ఏఐసీసీ నుంచి కీలక మెప్పు
– మంత్రులంతా మళ్లీ దారిలోకి
– ఇక ముందు రేవంత్ దే తుది నిర్ణయం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాంతాల్లో గెలిచి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముందు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికలోకి రంగంలోకి దిగింది. కాంగ్రెస్ వ్యూహంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి?.. అసలు ఇప్పుడు రేవంత్ కు వచ్చిన వ్యూహం ఏమిటి..? ఏఐసీసీ దగ్గర ఏం జరిగింది.. నిన్నటిదాకా అటూ ఇటూ ఇన్న మంత్రులు మళ్లీ దారిలోకి వచ్చినట్టేనా అనేది ఇప్పుడు రాజకీయ చర్చ.
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాంతాల్లో గెలిచి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముందు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికలోకి రంగంలోకి దిగింది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పక్కా ప్రణాళికలతో వ్యవహరించి అఖండ విజయాన్ని అందుకుంది. తన వ్యూహాలతో ప్రత్యర్థులకు దొరక్కుండా మాస్టర్ ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేసింది. ఈ వ్యూహాల వెనుక మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన ముందు చూపుతో మంత్రులకు పక్కాగా బాధ్యతలు అప్పగించి గెలుపే పనితీరుకు ప్రామాణికమని ఆయన స్పష్టంగా చెప్పారు. అందరూ కలిసికట్టుగా పని చేస్తే విజయం తమదే అని చెప్పిమరీ, అత్యధిక వార్డులు, డివిజన్లను సొంతం చేసుకుంది.
మహిళల ఓటర్లే కాంగ్రెస్‌కు ఆయుధం?:
ఎక్కడైనా ఓట్ల పడాలంటే ప్రజలకు సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలుు చేయాలి. కేవలం ప్రకటించడం మాత్రమే కాకుండా వాటిని పక్కాగా అమలు చేయాలి. ఆ అమలు తీరును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పేదలు, ముఖ్యంగా మహిళల్లో పార్టీపై అభిమానం పెరిగేటట్లు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వంటగ్యాస్ రూ.500లకే, రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ, నెలకు రూ.200ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో విస్తృతంగా జనాల్లోకి వెళ్లారు. దీంతో మహిళల్లో పార్టీపై మంచి పేరును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ మహిళా ఓటర్లే కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు.
గాంధీభవన్ నుంచి ఫోన్ కాల్స్:
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో లేదో అని గాంధీభవన్‌లో వార్ రూం నుంచి ఫోన్ చేసి అడిగేవారు. అలా చేయడంతో చాలా మంది ఫోన్‌లో కాంగ్రెస్ పార్టీకే తమ ఓటు అని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నింటా నెగ్గడమే ధ్యేయంగా ముందుగా లోక్‌సభ నియోజకవర్గానికొక మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించి పీసీసీ స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
ఇన్‌ఛార్జీల నియామకంతో గెలుపు
ఆశావహుల నుంచి పేర్లను సేకరించి, వాటిని సమగ్రంగా వడపోసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పూర్తి బాధ్యతను కమిటీలకే అప్పగించారు. ఎవరి ఒత్తిళ్లకూ లొంగి పార్టీకి నష్టం కలిగించవద్దని సీఎం స్పష్టం చేయడంతో నేతలు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పాత, కొత్త తరం నాయకుల మధ్య ఉన్న విభేదాలను ముందుగానే గుర్తించి, పరిశీలకులు మరియు కమిటీ సభ్యులను పంపి వాటిని పరిష్కరించారు. ప్రతి మున్సిపాలిటీకి ఇతర ప్రాంతానికి చెందిన నేతను పరిశీలకుడిగా నియమించి, స్థానిక పరిస్థితులపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు నిష్పాక్షిక నివేదికలు అందేలా చర్యలు తీసుకున్నారు. లోపాల సవరణలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఇన్‌ఛార్జి మంత్రులను అప్రమత్తం చేశారు. అంతర్గత సమావేశాల్లో ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ బలాబలాలను అంకెలతో సహా సీఎం రేవంత్ రెడ్డి వివరించి, వెనుకబడి ఉన్నచోట గట్టి చర్యలు తీసుకోవాలని బాధ్యులైన నేతలను హెచ్చరించారు.
కొన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు కఠిన పోటీ ఉందని సర్వేలో తేలడంతో స్థానిక నేతలు, స్క్రీనింగ్ కమిటీని ముందస్తుగా అప్రమత్తం చేసి ప్రచార వ్యూహాలను మెరుగుపరచడం ద్వారా అక్కడ విజయం సాధించినట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే రెబెల్స్‌గా బరిలో నిలవడం వల్ల కొన్ని చోట్ల ప్రతిపక్షాలకు లాభం కలిగిన నేపథ్యంలో, అదే పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. జగిత్యాల మినహా ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలవకుండా సీఎం, పీసీసీ, ఏఐసీసీ తీసుకున్న చర్యలు ఫలించాయి. అయితే జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి రెబెల్స్‌ను ప్రోత్సహించడం వల్ల కాంగ్రెస్ బీ ఫాం మీద పోటీ చేసిన తొమ్మిది మంది అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ అంశాన్ని పార్టీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి.