ముద్ర, నారాయణపేట:
నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలను అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ అన్నారు. 6 గ్యారంటీల అమలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను కు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలన్నారు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి తొలం బంగారం, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సమయానికి అందకపోవడం తో రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారప డాల్సిన పరిస్థితి ఏర్పడుతోం దన్నారు. అలాగే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకుఅందడంలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్న అనేక మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఇప్పటికీ ఒక్క పెన్షన్ మంజూరు కాలేదనీ విమర్శించారు. అర్హులైన అభ్యర్థులందరి దరఖాస్తు లను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షులు సత్యా యాదవ్, కే.రతంగ్ పాండురెడ్డి, తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్, వైస్ చైర్మన్ మంజుల జి ఆర్ రెడ్డి, కౌన్సిలర్ లు సత్య రఘుపాల్ రెడ్డి, కమలా పూర్ ప్రభాకర్ , రాఘవేందర్, సర్పంచ్ లు కే.నాగిరెడ్డి, చంద్ర శేఖర్ గౌడ్, రఘురామయ్య గౌడ్, నరేందర్ చారి, పేట మండల బిజెపి అధ్యక్షులు జ్యోతి సాయి బన్న తదితరులు పాల్గొన్నారు.