శంకర్‌గౌడ్ మృతికి కొవ్వొత్తులతో ఆర్టీసీ కార్మికుల నివాళి…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకోగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో జగిత్యాల డిపోలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే కార్మికుల ఆందోళన చేపట్టారు. శంకర్‌గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కార్మికులంతా కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు. కాగా ఆర్టీసీ అధికారులు కొన్ని అద్దె బస్సులను నడుపుతున్నారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ ఫ్లెక్సీతో అర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి మొదలైన ర్యాలీ కొత్త బస్ స్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు నిర్వహించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా RTC డిపో ముందర కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మాజీ మంత్రి BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ… RTC కార్మికులు సమ్మెకు పోవడం దురదృష్టకరమని, ప్రభుత్వ నిర్లక్షం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం RTC నీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చర్చించటం జరిగిందని, గతంలో RTC విలీన ప్రతిపాదన శాసన సభలో శాసన మండలిలో ఏకగ్రీవ ఆమోదం తెలుపడం జరిగిందన్నారు. శంకర్ గౌడ్ గారి మరణం ప్రభుత్వానికి చెంప పెట్టు అని, RTC కార్మికులు రోడ్ ఎక్కడానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా కారణమన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మకమే రేవంత్ రెడ్డి ఆదాయమని, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇందులో బాధ్యుడని విమర్శించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల తదితరులు పాల్గొన్నారు.