ఎస్.ఎస్.సి పరీక్షలపై కట్టుదిట్టమైన నిబంధనలు – నో ఫోన్ నిబంధన తప్పనిసరి అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశాలు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
జిల్లాలో నిర్వహించబడనున్న ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రెవిన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్ కీలక సూచనలు జారీ చేశారు. శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని పదో తరగతి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులపై కఠినంగా ఫ్రిస్కింగ్ నిర్వహించాలని, ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షా సిబ్బంది కూడా మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్రతి పరీక్షా రోజున “No Phone” సర్టిఫికేట్‌ను విధి రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.
విద్యార్థులు, సిబ్బంది ఎవరూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని, ANM మరియు ఇతర సిబ్బంది కూడా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు తమ మొబైల్ ఫోన్‌లను వాహనాల్లోనే జమ చేయాలని ఆదేశించారు.క్లెరికల్ సిబ్బంది, రిలీవర్లు పరీక్ష పూర్తయ్యే వరకు చీఫ్ సూపరింటెండెంట్ గదిని విడిచిపెట్టకూడదని, అన్ని వాహనాలు పరీక్షా కేంద్రం బయటే పార్క్ చేయాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు తరచూ పర్యవేక్షణ నిర్వహించి, అనధికార వ్యక్తులు కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్ నుండి పరీక్షా కేంద్రానికి తీసుకురావడం, అలాగే పరీక్ష అనంతరం పోస్టాఫీసుకు పంపే సమయంలో తప్పనిసరిగా ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ జూమ్ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్, పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.ఎస్.ఎస్.సి పరీక్షలపై కట్టుదిట్టమైన నిబంధనలు – నో ఫోన్ నిబంధన తప్పనిసరి అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశాలు.