వివిధ జిల్లాల నుంచి పాదయాత్రగా కొండగట్టుకు…
కాషాయ మయమైనా అంజన్న క్షేత్రం..
అంజన్న దర్శించుకుంటున్న లక్షలాది భక్తులు…
అసౌకర్యాలతో భక్తుల ఇక్కట్లు…
ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీలు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా కొలిచే కొండగట్టు అంజన్న స్వామి చిన్న జయంతి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి అంజన్న క్షేత్రం కు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇక ఎటు చూసినా హనుమాన్ దీక్ష పరులతో దారులన్నీ కొండగట్టు వైపే కనిపించాయి. తరలివస్తున్న దీక్షా పరులతో ఆలయ పరిసరాలు కాషాయ వర్ణంతో కలకలాడుతున్నాయి. కొండగట్టులో రాత్రి నుంచి మొదలైన తాకిడి ఇంకా కొనసాగుతుండగ, రాత్రి నుంచి సుమారు లక్షలకు పైగా మంది భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా హనుమాన్ దీక్ష పరులు కొండగట్టుకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని, మాలవిరమణ చేసి, స్వామివారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మూడు రోజులపాటు జరిగే ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ఆలయ అర్చకులు స్వామి వారికి పూలు పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. హనుమాన్ దీక్ష పరులు, సాధారణ భక్తులు కాలినడక కొండగట్టు చేరుకొని స్వామివారి దర్శించుకోవడం విశేషం.

జయంతి ఉత్సవాలకు పటిష్ట భద్రత…
హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, అత్యవసర సేవల అందుబాటు వంటి అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేస్తూ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి వైర్లెస్ సెట్ల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ అన్ని విభాగాల మధ్య సమన్వయం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాల విరమణ, దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. ముక్యంగా రాత్రి వేళల్లో పటిష్ట బందోబస్తు కొనసాగించాలని, అనుకోని ఘటనలు చోటుచేసుకున్న వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.

భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు…
భక్తులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్గమధ్యంలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, తాగునీరు, ప్రథమ చికిత్స, మార్గదర్శక సేవలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా హెల్ప్ డెస్కులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్ల..
హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షపరులు కాలినడకన కొండగట్టుకు చేరుకునే సమయంలో ముఖ్యంగా రోడ్డు ఇరువైపులా జాగ్రత్తగా నడుస్తూ, వాహనాలను గమనిస్తూ తమ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలో భాగంగా భక్తుల యొక్క బ్యాగులు, జెండాలు, ఇతర వస్తువులపై రేడియం స్టిక్కర్లను అంటించారు. చీకటి సమయంలో కూడా ఈ రేడియం స్టిక్కర్లు స్పష్టంగా కనిపించడంతో వాహనదారులు దూరం నుంచే భక్తులను గమనించి తమ వాహనాల వేగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చు ఎస్పీ పేర్కొన్నారు.
అసౌకర్యాలతో భక్తుల ఇక్కట్లు…
కొండగట్టులో చిన్న జయంతి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే భక్తులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం, తాగునీరు సరిగా అందకపోవడం, స్నానాలకు కూడా భక్తులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వేసవి తీవ్రతతో మండే ఎండల వల్ల అప్పటికే పాదయాత్ర చేసి అలసిపోయిన భక్తులకు సరిపడా నీడ లేక ఇబ్బందులు పడ్డారు.