Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ఎంఐఎం ఆటలు సాగనివ్వం-మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్

ఎంఐఎం ప్రాబల్యమున్న పట్టణాల్లో బీజేపీ బలపడింది
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం అనైతిక పొత్తులు
అయినా ప్రజలు బీజేపీనే ఆశీర్వదించారు
మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఎంఐఎం ఆటలు సాగనివ్వబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎంఐఎం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు, పట్టణాల్లో బీజేపీ బలపడిందన్నారు. ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం బలం తగ్గిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం రివైవల్ డే నిర్వహించడంపై మండిపడ్డ ఆయన దేనికోసం రివైవల్‌ డే చేస్తున్నారని ప్రశ్నించారు. రజాకర్ల రాజ్యం తెస్తారా.. మహిళలను కించపరిచి బతుకమ్మ ఆడిస్తారా.. పాత రాజ్యం తెస్తామని ఎంఐఎం రివైవల్ డే చేస్తుందా? అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం అనైతిక పొత్తులు పెట్టుకొని బీజేపీని ఓడించాలని కుట్ర పన్నాయన్నారు. అయినా ప్రజలు మాత్రం తమను ఆశీర్వదించారని చెప్పారు. అత్యధిక స్థానాలు చేజెక్కించుకున్న తాము పక్కా ప్లాన్‌తో వ్యూహాత్మకంగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నామని స్పష్టం చేశారు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తే.. వారి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం బయట పెడతానని తేల్చి చెప్పారు. ఎంఐఎం పార్టీ… ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు అనుసంధానకర్తగా పనిచేస్తుందని ఆరోపించారు. కరీంనగర్‌లో కార్యకర్తల కష్టం, ప్రధాని మోదీ ఆశీస్సులతో గెలవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు బీజేపీలో చేరారని, మేయర్ పీఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటేశామని వెల్లడించారు. మున్సిపల్‌ పీఠం ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్‌ సిటీ అభివృద్ధి కోసం ఇప్పటివరకూ రూ.1,400 కోట్ల పనులు చేశామని తెలిపారు. ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించినందుకు కరీంనగర్ ప్రజలకు బండి కృతజ్ఞతలు చెప్పారు. కాగా రాష్ట్రంలో బీజేపీ గెలుపుపై పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.