మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి నిర్మల్, సారంగాపూర్ లో ఏర్పాటుకు మంత్రి ఆదేశాలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు వినతిపత్రాన్ని శుక్రవారం సమర్పించారు. నియోజక వర్గంలో మొక్కజొన్న పంటను విస్తారంగా రైతులు సాగు చేశారని, కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం పది కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుందని పేర్కొన్నారు. స్పందించిన మంత్రి మొదటి విడతలో నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జొన్న పంట కొనుగోలు రాష్ట్రంలో ఎక్కడ కేంద్రాలు ప్రారంభించలేదని, త్వరలోనే నిర్మల్ జిల్లాలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన రాష్ట్రమంత్రికి శ్రీ హరి రావు కృతజ్ఞతలు తెలిపారు.