Take a fresh look at your lifestyle.

జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం* మొదటిసారి డిజిటల్ పద్ధతిలో జనగణన అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్:
2027 -జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో జనాభా గణనను సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు, రెండో దశలో జన గణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని వివరించారు. మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారన్నారు. మండలంలో తహసిల్దార్, మున్సిపాలిటీలో కమిషనర్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తారన్నారు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన ద్వారా లభించే గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ఈసారి దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు.
అదే విధంగా ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంట గది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు లాంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరిస్తారని వివరించారు.
ఈ శిక్షణలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్ఓ జోజి, ఆర్డీవోలు రమాదేవి, జై చంద్రారెడ్డి, రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఆర్డీవోలు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.