సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి :
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు.

గురువారం కలెక్టర్ పుల్కల్ మండలం గొంగ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు సింగూర్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
గొంగ్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, వాష్ రూములు, పాఠశాల ఆవరణ, తదితరాలను పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. భోజనం నాణ్యత, మెనూ వివరాలను తెలుసుకున్నారు.
పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్, రోజువారీ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారా, స్నాక్స్ అందిస్తున్నారా అని ప్రశ్నించగా, విద్యార్థులు తరగతులు సక్రమంగా జరుగుతున్నాయని, స్నాక్స్ ఇస్తున్నారని తెలిపారు.
పరీక్షలుసమీపిస్తున్నందున సమయాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని హితవు పలికారు.
పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించిన కలెక్టర్, శుభ్రత లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు మరుగుదొడ్లు శుభ్రం చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సింగూర్ గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులను పలకరించి పాఠ్యాంశాల పురోగతిపై ప్రశ్నించారు. సిలబస్ పూర్తిచేసి, పునరావృతం ద్వారా మెరుగైన ప్రతిభ కనబర్చాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రోత్సహించారు.
అనంతరం బస్వాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల” పనుల పురోగతిని పరిశీలించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు