శ్రీపాదరావు స్ఫూర్తితో శక్తివంతన లేకుండా పనిచేస్తాం..స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి వేడుకల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
శ్రీ పాదరావు విగ్రహావిష్కరణ చేయడం సంతోషం..
ముద్ర, మంథని:
స్వర్గీయ శ్రీపాదరావు ఆశయ సాధనలో శక్తి వంచన లేకుండా పనిచేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మాజీ స్పీకర్ దివంగత నేత శ్రీపాదరావు 27వ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంథనిలో శ్రీపాదరావు వర్ధంతి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీపాదరావు విగ్రహావిష్కరణకు తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అజాత శత్రువుగా పేరున్న శ్రీపాద రావు గారు ఇదే రోజు జరిగిన దుస్స సంఘటనలో మరణించడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా శ్రీపాదరావు నేనున్నానంటూ కార్యకర్తల కష్టసుఖాల్లో భాగమయ్యారని మంత్రి అడ్లూరి అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన శ్రీపాద రావు గారు ధన్వాడ సర్పంచ్ గా, మంథని సమితి ప్రెసిడెంట్ గా, మంథని ఎమ్మెల్యేగా సేవలు అందించారని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పని చేసి స్పీకర్ పదవికి వన్నె తెచ్చారని మంత్రి తెలిపారు. శ్రీపాదరావు గారి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు గారు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారని తనలాంటి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తకు క్యాబినెట్లో అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి మంత్రి శ్రీధర్ బాబు అని మంత్రి అడ్లూరి అన్నారు. శ్రీధర్ బాబు గారి సహకారంతోనే రాష్ట్ర బడ్జెట్లో తన శాఖకు రూ. 17 వేల కోట్లు కేటాయించే అవకాశం తనకు దక్కిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎన్నికల సమయంలో ధర్మపురి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల వరకు ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటు తో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రం, సబ్ ట్రెజరీ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు సహకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.