బయ్యారం పై మళ్ళీ చిగురిస్తున్న ఆశలు…!! -కేంద్ర ఉక్కుశాఖమంత్రికి ముఖ్యమంత్రి వినతిపత్రం….-బయ్యారం లో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి….
ముద్రప్రతినిధి, మహబూబాబాద్:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర ఉక్కుశాఖమంత్రి హెచ్ డి కుమారస్వామి, ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ లను శనివారం స్వయంగా కలిసి, మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కుపరిశ్రమ) ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించి, విజ్ఞప్తి చేయడం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చ కు తెరలేపింది. విభజన చట్టంలోనే బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని అంశం ఉన్నప్పటికీ అది..ఆచరణలో మాత్రం రోజురోజుకు అదృశ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఈ..సమయంలో స్వయంగా రాష్ట్రముఖ్యమంత్రి కేంద్రం ఉక్కుశాఖ మంత్రిని కలిసి బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరడంతో.. మండువేసవిలో మహబూబాబాద్ జిల్లాప్రజల ఉక్కు పరిశ్రమ ఆశలు ఒక్కసారిగా చిగురించాయి.!! బయ్యారం లో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతోపాటు, పర్యావరణానికి మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కుశాఖమంత్రి హెచ్ డి కుమారస్వామి కి తెలిపారు. ఢిల్లీలో కేంద్రఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి, ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఈ..అంశంపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సీఎం కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ..ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వైపు అడుగులు పడితే, అత్యంత ఎక్కువగా గిరిజన జనాభా కలిగిన మహబూబాబాద్ జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ప్రారంభం అవుతుందని, వేలాదిమంది కి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుతాయని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ.. ప్రత్యేక సమావేశం మహబూబాబాద్ జిల్లా ప్రజలకు శుభవార్త గానే భావిస్తున్నారు. జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, యంపి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై కాస్త ఒత్తిడి పెంచైనా బయ్యారం ఉక్కుపరిశ్రమ సాదించాలనే సంకల్పంతో పని చేయాలని మహబూబాబాద్ జిల్లావాసులు కోరుతున్నారు.