ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికి న్యాయం చెయ్యాలి-సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు.
మోత్కూర్ ముద్ర న్యూస్:
భూదాన్ ఇండ్ల కూల్చివేత సందర్బంలో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి సామానులు కూడ తీసుకోనివ్వకుండా నిరుపేదల ఇండ్లను కూల్చి వారిని గెంటివేయడం అన్యాయమని తక్షణం ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చెయ్యాలని, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న భూదాన్ భూముల్లో 10 సంవత్సరాల నుండి పట్టాలు పొంది 600 మంది నిరుపేదలు ఇండ్లు నిర్మించుకుని నివశిస్తున్నారని వారి ఇండ్లను కూల్చివేయడం వల్ల వారు రోడ్డున పడ్డారని విద్యార్థులు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు కూడ రాయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 2014 సంవత్సరం నుండి బడా బాబుల భూములను క్రమ బద్దికరణ చేస్తున్న ప్రభుత్వం పేదల ఇండ్లను ఎందుకు క్రమబద్ధికరించలేదని ప్రశ్నించారు.ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మొత్తం 62 ఎకరాల్లో 32 ఎకరాల్లో ఇండ్లులేని నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చి రూ 250 కోట్ల రూపాయల ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని గొప్పలు చెపుతున్నా, మిగతా స్థలం ఏమైందో నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అక్కడ నిరుపేదల ఇండ్లను కూల్చామని చెపుతున్న ప్రభుత్వం, మిగతా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించ్చారు. నిరుపేదలు ఆక్రమణదారులు కాదని, కూలిపనులు చేసుకొని అప్పులు తెచ్చి, నిలువ నీడకోసం నిర్మించున్న వారి ఇండ్లను కూల్చివేసి ప్రభుత్వ ఆస్తిని కాపాడమని చెప్పడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్వాసితులైన పేదలు సర్వంకోల్పోయి తినడానికి తిండికూడ దొరుకక అల్లాడుతున్నారని, వారికి తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించడంతో పాటు, ఇండ్లు కోల్పోయిన ప్రతిఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇండ్లు నిర్మించివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.