ముద్ర కుకట్‌పల్లి :
పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ నేరస్థులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
గత కొంతకాలంగా కుకట్‌పల్లి పరిసర ప్రాంతాలైన బాలాజీ నగర్, గాయత్రీ నగర్, సప్తగిరి కాలనీలలో ద్విచక్ర వాహనాల చోరీలపై వరుస ఫిర్యాదులు అందాయి. ఈ కేసులను సవాలుగా తీసుకున్న కుకట్‌పల్లి క్రైమ్ టీం, డీఎస్ఐ జి. రవీందర్ రెడ్డి నాయకత్వంలో దర్యాప్తు చేపట్టింది. సోమవారం ఉదయం కుకట్‌పల్లి బస్ స్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అరెస్టయిన వారిలో సంగీత్ నగర్‌కు చెందిన కోమల లక్ష్మణ్ (15), అబ్బనపురి కృష్ణమూర్తి (14) మరియు దయార్‌గూడకు చెందిన నూనె విశాల్ (17) ఉన్నారు. వీరింతా పదో తరగతి విద్యార్థులు కావడం గమనార్హం. వీరి నుంచి ఈ క్రింది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
* సుజుకి స్కూటీ (AP39RX-9064)
* టీవీఎస్ జూపిటర్ (TG08E-6355)
* హోండా యాక్టివా (TS26B-7549)
* డియో మోటార్ సైకిల్ (KA05KV-1064)
నిందితులను జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన క్రైమ్ స్టాఫ్ ఎం. అమృత్ రావు, ఎస్. భాస్కర్, డి. రవీందర్ తదితర బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.