బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి….
ముద్ర, కోరుట్ల;
మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ గత మూడు రోజులుగా ఘటనపై ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. “రక్షకుడే భక్షకుడు అయ్యాడు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారి విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని, బాలికకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు గాని ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు ఈ ఘటనపై స్పందించి ఆ చిన్నారికి న్యాయం జరిగేలా ముందుకు రావాలని కోరారు. మహిళల భద్రతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండలాధ్యక్షులు దారిశెట్టి రాజేష్, నాయకులు చీటి వెంకట్రావు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.