Take a fresh look at your lifestyle.

బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి-కలెక్టర్ అభిలాష అభినవ్

 

జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాను బాల్యవివాహాలు లేని, మాదక ద్రవ్యాల వినియోగించని జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం అమలు, రహదారి భద్రత, బాల కార్మికుల సంరక్షణ తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది 45, ఈ ఏడాది ఇప్పటివరకు 2 బాల్యవివాహాలను అడ్డుకున్నామని తెలిపారు. బాల్యవివాహాల సమాచారం అందిన వెంటనే సంక్షేమ, పోలీసు, విద్యాశాఖలు సమన్వయంతో వెళ్లి అడ్డుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, నిర్ణీత వయస్సు వచ్చే వరకు వివాహం జరపబోమని ధృవీకరణ పత్రాలు తీసుకోవాలన్నారు.
బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాలబాలికలకు విద్యను అందించడంతో పాటు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన చర్యలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు. అ లాగే మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గంజాయి, నాటు సారా వంటి నిషేధిత పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి కేసులు నమోదు చేయాలన్నారు. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం “బాలవివాహ ముక్త భారత్” కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.