ప్రతి ఏటా తప్పని మరణాలు
ప్రభుత్వాలు మారినా చర్యలు శూన్యం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల మృత్యుఘోష మళ్ళీ మొదలైంది. చదువుకుని బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. కొందరు చదువు ఒత్తిడి తట్టుకోలేక, మరికొందరు కుటుంబ సమస్యలతో, మరికొందరు ఇతర కారణాలతో తనువు చాలిస్తున్నారు. ఈ మరణ మృదంగాన్ని ఆపేలా అధికారుల చర్యలు శూన్యం. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా ప్రతి ఏటా కనీసం నలుగురైదుగురు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది. గత ఏడాదిగా సద్దుమణిగిన ఆత్మహత్యలు మంగళవారం రాత్రి వసంత ఆత్మహత్యతో మళ్ళీ మొదలయ్యాయి బాసరలో ఐఐఐటి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. గతేడాది ఏప్రిల్ మాసంలో పియుసి రెండో సంవత్సరం విద్యార్థి సిద్ధిపేట జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఇదే నెల్లో నిజామాబాద్ జిల్లా పెర్కిట్ కు చెందిన స్వాతి ప్రియ ఆత్మహత్యకు పాల్పడింది. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోగానే రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కే టి రామారావు, ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లు ట్రిపుల్ ఐటి ని సందర్శించి హామీల వర్షం కురిపించారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగి వెళ్లారు. ఇచ్చిన హామీలన్నీ నిజమవుతాయనీ, తమకు ఇబ్బందులు రావని భావిస్తున్న విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. ఇక అదే సమయంలో ప్రతి పక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ని ట్రిపుల్ ఐటి లో ప్రవేశించేందుకు అనుమతించకపోతే మహారాష్ట్ర మీదుగా ట్రాక్టర్ లో బాసరకు చేరుకుని, గోడ దూకి లోపలికి ప్రవేశించారు. తమ ప్రభుత్వం రాగానే ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చారు. నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారినా సమస్యలు మారలేదు. ఆత్మహత్యలు ఆగలేదు. నాయకులు వచ్చినపుడు విద్యార్థులతో ఫోటోలు దిగే నేతలు మారుతున్నారే తప్ప పరిస్థితులు మారటం లేదు. విద్యార్థులకు అండగా నిలవాల్సిన సిబ్బందిలో అత్యధిక సిబ్బంది కాంట్రాక్ట్ పద్దతిన పని చేస్తున్నారు. దీంతో వారు కేవలం పని చేసుకుని వెళుతున్నారే తప్ప విద్యార్థుల బాగోగులు పట్టించుకోవటం లేదు. 2007 నుంచి ఇప్పటి వరకు ఈ ట్రిపుల్ ఐటి చరిత్రను చూస్తే ఇన్ఛార్జీల పాలన, కాంట్రాక్ట్ ఉద్యోగులే తప్ప పట్టించుకున్న వారే లేరు. ఇప్పటి వరకు పూర్తి స్థాయి అధికారుల పాలన ఈ సంస్థ చరిత్రలోనే లేదు. ఇదిలా ఉంటే ఇన్ఛార్జీలుగా ఉన్నవారు వారి అసలు విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ నుంచి పర్యవేక్షణ ఎలా చేస్తారన్నది వారిని ఇన్ ఛార్జీ గా నియమిస్తున్న పాలకుల వైఖరి అంతుపట్టడం లేదు. ప్రతి ఏడు విద్యార్థులు నిరసనలు తెలుపుతూ రోడ్డెక్కుతున్నా ఎవరికీ పట్టడం లేదు. మెస్ లో కనీసం తినేందుకు వీలులేని ఆహారం ఇస్తున్నా కాంట్రాక్టర్ పై చర్యలు లేవు. గతంలో విసి ప్రతి గా ఉన్న గోవర్ధన్ స్వాతి ప్రియ మృతి చెందిన రోజు ఆయన హైదరాబాద్ నుంచి ఆదరా బాదరాగా వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇక్కడి సమాచారం బయటకు వచ్చిందంటే వారిని టార్గెట్ చేస్తూ పరిపాటిగా మారిందని మాజీ విద్యార్థి ఒకరు చెప్పటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక విద్యార్థులు మృతి చెందిన ప్రతి సారి గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించడం చూస్తే అనుమానాలు రేకెత్తుతున్నాయి. బాసరలో ఆత్మహత్యకు పాల్పడితే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైంసాకు కాకుండా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ కు తరలించటం పరిపాటిగా మారింది. విద్యార్థులకు మనోధైర్యం కలిగించేలా మానసిక వైద్య నిపుణుల శిక్షణా తరగతుల ఊసే లేదు. ఆత్మహత్య ఉదంతాలు జరిగిన కొన్ని రోజుల దాకా అధికారుల హడావిడి పర్యటనలు, ఆ తర్వాత షరా మామూలే అన్న చందంగా పరిస్థితి తయారైంది. గతేడాది నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారు ఈ సంస్థను దత్తత తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. ఐతే అనంతరం సంస్థ అధికారుల తీరు మళ్లీ పాత పద్ధతిలోనే సాగింది.
విద్యార్థుల ఆగ్రహానికి నిధుల దుర్వినియోగమే కారణమా?
ఇదిలా ఉంటే గతంలో ట్రిపుల్ ఐటీలో సమస్యలపై నిరసనలు వ్యక్తం చేసిన విద్యార్థులు బుధవారం వి సి ఛాంబర్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడం వెనుక కూడా బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల బాగోగులు అధికారులు పట్టించుకోకపోవటం ఒక కారణం. కాగా ఇటీవలే ట్రిపుల్ ఐటీలో కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినపుడు కూడా దాన్ని కప్పిపుచ్చే యత్నాలు చేయటం కూడా మరో కారణమని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికైనా చదువుల తల్లి ఒడిలో విద్యా కుసుమాలు నేల రాలకుండా చూడాల్సిన అవసరం ఉంది.