ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వర్షంవల్ల నష్టపోయిన మొక్క జొన్న పంటను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. మండలంలోని సోన్, కూచన్ పల్లి, బొప్పారం, న్యూ వెల్మల్ గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. సుమారు ఒక్క సోన్ మండలంలోనే 1000 ఎకరాల పైనే పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీసారి నివేదికలు తెప్పించుకోవడం తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్ట పరిహారం చెల్లించలేదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్ట పోయిన ప్రతీ రైతును ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, న్యూ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ నరేష్, నాయకులు నరేష్, నర్సయ్య, శ్రీనివాస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.