తుంగతుర్తి, ముద్ర: కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా రాజకీయ ఆరంగేట్రం ప్రారంభించిన తిరుమల ప్రగడ కిషన్ రావు తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కిషన్ రావు కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చిన తన వారసత్వాన్ని అదే పార్టీలో కొనసాగిస్తూ సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా పార్టీలో చురుకైన కార్యకర్తగా నాయకుడిగా ఉంటున్నారు .తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కిషన్ రావు పనిచేశారు. కిషన్ రావు సతీమణి తిరుమల ప్రగడ అనురాధ తుంగతుర్తి మండల ఎంపీపీగా ఐదు సంవత్సరాలు కొనసాగారు అనంతరం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు రాజకీయంగా ఎలాంటి మచ్చలేని వీరు తమ కుటుంబానికి నామినేటెడ్ పదవుల్లో తగిన గుర్తింపు రావడం లేదని కొంతమేర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేసే తన కుటుంబానికి తగిన గుర్తింపు రావాలని కోరుతున్నారు. ఈ మేరకు కిషన్ రావు తనకు తుంగతుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో తనకు గుర్తింపు ఉందని అందువల్ల తనకే బ్లాక్ కాంగ్రెస్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో కిషన్ రావు సతీమణి అనురాధ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన బాధ్యత అప్పగించిన తాము ఆ బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని అందుకే తమకు నామినేటెడ్ పదవుల్లో సరైన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కిషన్ రావు విజ్ఞప్తి పరిశీలించి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్తుందా? లేక మరేదైనా నామినేటెడ్ పదవులో స్థానం కల్పిస్తారా? వేచి చూడాల్సిందే.