Take a fresh look at your lifestyle.

డంపింగ్ యార్డ్‌తో నరకం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్కడి ఎమ్మెల్యేగా ఉన్నందుకు బాధపడుతున్న

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిస్థితి ప్రస్తుతం అత్యంత అధ్వానంగా తయారైందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నగరం నలుమూలల నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికే చేరుతోందన్న ఆయన.. ఆ వాసన భరించలేక తాను అక్కడ ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రజా సమస్యలపై జరిగిన చర్చలో మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రసంగించి సభను ఆకట్టుకున్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ దుస్థితిని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ‘నేను ఎందుకు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నానా అని బాధపడుతున్నాను’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును ‘స్పెషల్ కేటగిరి’ కింద అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గం ముక్కలు ముక్కలు..

దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గమైన మేడ్చల్‌ను ముక్కలు ముక్కలు చేశారని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 61 గ్రామాలు, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు ఉండేవని, వాటన్నింటినీ జీహెచ్‌ఎంసీలో కలిపేసి కేవలం 16 వార్డులుగా మార్చారని తెలిపారు. దీంతో నియోజకవర్గంలో డ్రైనేజీలు, రోడ్లు, కరెంట్ పోల్స్ వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయని, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పెంకుటిళ్లే ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘శ్రీధరన్న.. జర నన్ను పగబట్టకే.. మా జిల్లా ఇంచార్జ్ మంత్రివి నువ్వే’ అని విన్నవించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని, మేడ్చల్ నియోజకవర్గానికి జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.