- పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లాలోని మూడు గ్రామాలు.
- ఇప్పటికే పని మొదలు పెట్టిన అగ్రి, హార్టీ కల్చర్ అధికారులు.
- పైలట్ ప్రాజెక్టును సక్సెస్ చేయడానికి త్వరలో కోర్డినేషన్ కమిటీ.
- రైతులను ఉద్యాన వన పంటల వైపు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
- ఉద్యాన వన పంటలకు రాయితీలపై యాత్రపరికరాలు, డ్రిప్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు.సాగువిస్తీర్ణం పెంచేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మూడు గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద సూచించారు.మంగళవారం హైదరాబాద్ లోని రైతు కమిషన్ కార్యాలయంలో ఉద్యానవన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో ఇప్పటికే ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి పైలట్ ప్రాజెక్టు యాచారం మండలంలోని గడ్డమల్లయ్య గూడెం, మొండి గౌరెల్లి, చౌదరి గూడ గ్రామాలను ఎంపిక చేసుకున్నట్లు అధికారులు వివరించారు.ఆయా గ్రామాల్లో కూరగాయలు,ఆకు కూరలు పండించే రైతులకు ప్రభుత్వం నుండి ఏమి కావాలి అనేది గుర్తించినట్లు వెల్లడించారు.ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం, నీటి వనరులు తక్కువగా ఉంటాయి కాబట్టి నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటల సాగుచేయాలని సూచించారు.దానికి తగ్గట్టుగా అధికారులు రైతులకు దిశానిర్దేశం చేయాలన్నారు. ఎఫ్ పీ వోలను ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేయాలన్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా కూరగాయలు ఆకుకూరలు,పండ్లు,పూలతోటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన వన పంటలకు రాయితీలపై యంత్ర పరికరాలు, డ్రిప్ లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతు కమిషన్ ఆధ్వర్యంలో ఒకటిరెండు రోజుల్లో అధికారుల కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల తోపాటు మార్కెటింగ్, నాబార్డు, ఎన్జీవో ప్రతినిధులు దీనికి హాజరవుతారని చెప్పారు. ఇందులో రైతు కమిషన్ నుండి ఒక అధికారికి కమిటీలో చోటు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీ రంగారెడ్డి జిల్లాలో యాచారం మండలంలోని మూడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు విజయవంతం చేయడానికి పని చేస్తోందన్నారు.ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్ తోపాటు మెంబర్ సెక్రెటరీ గోవిందు వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, నాబార్డ్ అధికారులు, కమిషన్ డీఏవో సంధ్యారాణి, అగ్రికల్చర్ అధికారి హరి వెంకట ప్రసాద్, ఎన్జీవోల ప్రతినిధులు హాజరయ్యారు.
