Take a fresh look at your lifestyle.

మంత్రి పదవి సమస్య కాదు.. అవమానం బాధించింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి నా సమస్య కాదు
బీజేపీని వీడి కాంగ్రెస్‍లో చేరినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారు
రెండున్నరేళ్లయినా మాట నిలబెట్టుకోలేదు
మంత్రి పదవి ఇవ్వలేకపోతే పిలిచి చెప్పేయాల్సింది
బీజేపీ నన్ను గౌరవించింది
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

అధికార పార్టీలో ప్రచారం జరుగుతున్నట్టు సీఎంపై తను చేస్తోన్న ఆరోపణలు, ప్రభుత్వ పాలన తీరుపై విమర్శలకు కారణం మంత్రి పదవి కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తన సమస్య అసలు కానే కాదన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీని వీడి కాంగ్రెస్‍లో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని చెప్పారు. ఆ మాటను పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది తర్వాత విషయమన్న రాజగోపాల్ రెడ్డి… పార్టీ అధికారంలోకి వచ్చాక తనను పార్టీలోకి తీసుకువచ్చిన సునీల్ కనుగోలు, భట్టి విక్రమార్క, మాణిక్ రావు థాక్రే, మహేశ్ కుమార్ గౌడ్‍ వంటి నేతలు తన పట్ల ప్రవర్తించిన తీరు చాలా అవమానకరంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీ వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటు సాధిస్తే మీకిచ్చిన హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చారని చెప్పారు. తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి ఇబ్బందులు ఉండవచ్చు. కానీ వారు తన పట్ల మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కనీసం పిలిచి చెప్పకపోవడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీలో గౌరవం ఉండేది
రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు నచ్చక గతంలో తాను బీజేపీకి వెళ్లానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆ పార్టీ నేతలు అక్కడ తనను ఎంతో గౌరవించారన్నారు. తనను పిలిచి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్‍లో స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అంత గౌరవించాక కూడా కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిలాంటిదని అందులోకి తిరిగి ఆహ్వానిస్తున్నారు కదా అని వచ్చానన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయిన పర్వాలేదు కానీ నన్ను అవమానించిన తీరు బాగోలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయం మరోలా ఉండేదని ఇటీవల సీపీఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం కూడా చెప్పారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నా విషయంలో తప్పు చేసినప్పటికీ ఢిల్లీకి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.