ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం ఉదయం శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా కొండ కింద ఉన్న శ్రీ వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గోవింద నామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ గావించారు.

గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకులు మంచి నీరు, మజ్జిగ అందించి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలు జరిగాయి. పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు, పసుపు,సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణలతో వసంతోత్సవ సేవను శోభాయ మానంగా అర్చక స్వాములు చేశారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 5000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవ సేవ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి రథోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.