రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ సొంత భవనాలు-అంగన్‌వాడీ చిన్నారులకు “తొలి ముద్ద” ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
వచ్చే మూడేళ్లలో పూర్తయ్యేలా ప్రణాళికలు, కార్యాచరణ
పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సంక్షేమం, కార్యక్రమాల అమలు గురుతర బాధ్యత అధికారులు, ఉద్యోగులదే
అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబం
ఆర్థిక వెసులుబాటుకు తగ్గట్టు సమస్యలు పరిష్కరిస్తాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అద్దె భవనాల్లో కాకుండా వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవాల్లో కొనసాగేలా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. శనివారం శాసనసభ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం “తొలి ముద్ద”ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టినట్లు వివరించారు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లితో పాటు కడుపులోని శిశువు, అలాగే పుట్టిన తర్వాత పిల్లలకు ఎలాంటి పోషకాహారం అందించాలన్న అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత ఈ కార్యాచరణ చేపట్టామని వివరించారు.

ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమం తీసుకొచ్చినా, క్షేత్రస్థాయి సిబ్బంది సరిగా అమలు చేసినప్పుడే దీనికి గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. ఆ గురుతర బాధ్యత సంబంధిత శాఖాధికారులు, ఉద్యోగులదే అన్నారు. ఆకలిని మీరు అమ్మగా అర్థం చేసుకుంటారని, సమస్యలపై మీకు అవగాహన ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. .మొదటి ఆరేండ్లు పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు. ఇది అత్యంత కీలక దశ అన్నారు. ఈ సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం అందించకపోతే ఆశించిన ఎదుగుదల ఉండదన్న సీఎం.. దీన్ని గ్రహించి అత్యంత పకడ్బంధీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అత్యంత విలువైన బాల్య దశ మీ చేతుల్లో ఉందనే విషయాన్ని మరచిపోవద్దని చెప్పారు. దేశంలో జనాభాకు తగ్గట్టు పోషకాహారం లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.

జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్న సీఎం.. చికిత్స కన్నా జబ్బు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందనీ ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా ముందుగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇ,చ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పలు అంగన్‌వాడీ టీచర్లు, పలువురు పిల్లలు పాల్గొన్నారు.