Take a fresh look at your lifestyle.

క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి – హైదరాబాద్ సీపీ సజ్జనార్

 

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ యువతకు సూచించారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ సమాచారం ఉంటే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే ఐపీఎల్ 19వ సీజన్ శనివారం బెంగుళూరు లో ప్రారంభమైంది. దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ లీగ్ అభిమానులను అలరించనుంది. ఇక క్రికెట్ అభిమానులతో పాటు బెట్టింగ్ రాయుళ్లు కూడా ఐపీఎల్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది బెట్టింగ్ ద్వారా వేల కోట్లు చేతులు మారుతుంటాయి. ముఖ్యంగా యువత ఎక్కువగా బెట్టింగులకు పాల్పడి అప్పులపాలవుతున్నారు. ఈనేపథ్యంలో బెట్టింగ్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ ఊబిలో పడి బతుకును ఛిద్రం చేసుకోవద్దని సూచించారు. ‘ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్‌హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ తో అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి.’ అని సీపీ సజ్జనార్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.