ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందనే అనుమానం ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపైనా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లో విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందనిఆరోపించారు. ఈ కేసులో దోషులను శిక్షించే చిత్తశుద్ధి సర్కారుకు లేదని విమర్శించారు. నిజంగా ఆ చిత్తశుద్ధే ఉంటే ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి ఉండేవారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఫోన్లు ట్యాపింగ్ చేయించిన నాయకులు విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆరోపించారు.