మహాదేవపూర్, ముద్ర:
2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జరగేలా సమగ్ర చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. సోమవారం గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులపై హైదరాబాద్ నుండి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు తరలి వచ్చే అవకాశం ఉన్నందున, ముందస్తు ప్రణాళికలతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. ముఖ్యంగా ఘాట్‌ల అభివృద్ధి, రహదారి సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నాన ఘాట్‌ల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని, జనసమ్మర్థ నియంత్రణ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా తాత్కాలిక వసతి గృహాలు, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని ఏర్పాట్ల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. ప్రతిపాదనల మేరకు ప్రాధాన్యత పనులకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గోదావరి పుష్కరాల నిర్వహణకు ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్, దేవాదాయ తదితర శాఖల ద్వారా చేపట్టనున్న పనులను వివరించారు. ఘాట్లు, మౌలిక సదుపాయాలు, రోడ్లు అభివృద్ధి, నూతన రోడ్లు నిర్మాణం వంటి చేపట్టనున్న పనులకు ఆయా శాఖల ద్వారా ప్రతిపాదనలు. పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.