Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం క్షేత్రంలోని పుష్కర పనులను పరిశీలించిన కలెక్టర్

 

మహాదేవపూర్, ముద్ర:

ప్రధాన ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భక్తుల సౌకర్యార్థం గోదావరి నదిలో క్వయర్ మ్యాట్ లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పి సిరి శెట్టి సంకీర్తనతో కలిసి కాళేశ్వర క్షేత్రంలోని పనులను స్వయంగా పరిశీలించారు. భక్తులు గందరగోళానికి గురికాకుండా తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ప్రధాన ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారిపై నిరంతరం నీటిని చల్లుతూ ఉండాలని ఆదేశించారు. సరస్వతి ఘాట్‌ వద్ద భక్తులు బట్టలు మార్చుకునే గదులు, షవర్ ట్యాప్స్ వంటి సదుపాయాలను పరిశీలించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రతి 50 మీటర్లకు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. అలాగే స్టాల్స్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని, టెంట్ సిటీ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. మ్యూజియాన్ని పరిశీలించిన కలెక్టర్ సమయం తక్కువగా ఉన్నందున ముఖ్యమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి విగ్రహం వద్ద పూర్తి సమాచారాన్ని ప్రదర్శించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ లు హరికృష్ణ, రవీందర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్, విద్యుత్తు, పంచాయతి రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.