- జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్.
- వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ.
- పోలీసుల బందోబస్తు.
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లోని కోర్ట్ ఆవరణలో గల ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా షబ్బీర్ అలీ నమాజ్ చేసి అందరికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వమానవాళికి అందిస్తున్నదని తెలిపారు.బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు.సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో దేశంలో పాలన కొనసాగాలని పేర్కొన్నారు.అన్నివర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాతో ప్రార్థించానని అన్నారు.తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగాలని అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బక్రీద్ వేడుకలు బాన్సువాడ లో జరుగగా రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నూ బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి.
- బక్రీద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
- ప్రధాన కూడళ్ళు, మసీదుల వద్ద పికెట్స్ ఏర్పాటు.
బక్రీద్ పండుగను పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని ప్రధాన ఈద్గాలు, మసీదులను జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించారు. అర్ఫత్ మసీద్ ఈదుగా, ఇస్లాంపూర్, గొల్లవాడ, ఇంద్రనగర్ కాలనీ, బాంబే కాలనీ, శైలాని బాబా కాలనీ, బతుకమ్మకుంట, అశోక్ నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో ఉన్న మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలను సుఖ:సంతోషాల నడుమ, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించాలని ఎస్పీ సూచించారు. ముస్లింల త్యాగనిరతికి, ధర్మ నిబద్ధతకి ప్రతీక బక్రీద్ పండుగ అని అత్యంత భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండగ జరుపుకుంటున్న ముస్లింల కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, కామారెడ్డి ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
