విద్యార్థుల మోడల్ యునైటెడ్ నేషన్స్ జిల్లా స్థాయి పోటీ నాయకత్వ లక్షణాలు, ఉత్తమ పౌరులుగా ఎదగాలి అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్
ముద్ర ప్రతినిధి మెదక్:


పీఎంశ్రీ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీ మెదక్ కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ ప్రారంభించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తే వీరిలో నాయకత్వ లక్షణాలు పెంపొంది ఉత్తమ పౌరులుగా మారుతారని సూచించారు. జిల్లాలోని 31 పీఎంశ్రీ పాఠశాలల నుండి ముగ్గురు విద్యార్థులు వివిధ దేశాల యొక్క ప్రతినిధులుగా పాల్గొన్నారు. ఇందులో వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు 56 దేశాలకు ప్రతినిధులుగా వ్యవహరించారు. మిగతా విద్యార్థులు అంతర్జాతీయ విలేకరులుగా వ్యవహరించారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అంశంపై చర్చించి వివిధ తీర్మానాలు చేశారు. అంతర్జాతీయ అంశాలు, ఐక్యరాజ్యసమితి నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య, జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శన్ మూర్తి, కోఆర్డినేటర్ లు రాజు, నవీన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ పాఠశాలల నుండి వచ్చిన గైడ్ టీచర్లు పాల్గొన్నారు. జడ్జిలుగా మెదక్ మండల విద్యాధికారి శంకర్, గాంధర్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యవహరించారు.