పాఠశాలలు తెరిచేనాటికి ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ (టి.ఎఫ్.ఎల్) మాదిరి సురక్షిత రవాణా వ్యవస్థ సిద్ధం
ముద్ర, శేరిలింగంపల్లి :
నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని కట్టడి చేయడంతో పాటు, విద్యార్థుల ప్రయాణాన్ని సురక్షితంగా, సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బృహత్తర కార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టింది. కేవలం ఒక రవాణా వ్యవస్థగానే కాకుండా, సాంకేతికతకు సామాజిక బాధ్యతను జోడిస్తూ ఒక మహోన్నత లక్ష్యం దిశగా సైబరాబాద్ పోలీసులు అడుగులు వేశారు. ఈ మేరకు ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ ఏర్పాటుపై పీఎస్‌ఐఓసీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్య పరిష్కారం అనేది కేవలం రహదారుల విస్తరణతోనే సాధ్యం కాదని, ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రుల మధ్య సమన్వయంతో కూడిన ఒక నిరంతర యజ్ఞమని అభివర్ణించారు. ప్రైవేట్ వాహనాల్లో సింగిల్ ఆక్యుపెన్సీ డ్రాప్‌లను తగ్గించి, పూల్డ్ రూట్లను శాస్త్రీయంగా అమలు చేయడం ద్వారా వనరులు, రహదారులపై ఒత్తిడిని గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. పాఠశాల విద్యార్థులతో పాటు క్రీడా శిక్షణకు వెళ్లే వారికి కూడా ఈ రవాణా వ్యవస్థ రక్షణ కవచంలా నిలుస్తుందని భరోసానిచ్చారు.
ఈ వ్యవస్థ కేవలం రవాణాకే పరిమితం కాకుండా, సమాజంలో ఉపాధి కల్పించే ఒక సాధనంగా నిలవనుందన్నారు. శిక్షణ పొందిన గిగ్ వర్కర్లు, వెసులుబాటు కలిగిన ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు అటెండెంట్లుగా, మొబిలిటీ సూపర్‌వైజర్లుగా అవకాశం కల్పించనున్నామన్నారు. వీరందరికీ పోలీసు ధృవీకరణను తప్పనిసరి చేయడం ద్వారా విద్యార్థుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేదని సీపీ చెప్పారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఒకే గొడుగు కిందికి తెచ్చి, విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, నాణ్యమైన, చవకైన ధరకే ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామన్నారు.
అత్యాధునిక సాంకేతికతతో వెన్నుదన్ను..
అత్యాధునిక స్టార్టప్ సాంకేతికతను జోడిస్తూ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్యవేక్షణలో పర్యావరణ సుస్థిరత, రూట్ ఆప్టిమైజేషన్, కాంప్లయెన్స్ డ్యాష్‌బోర్డులు, గేట్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ మొబిలిటీ వ్యవస్థ, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ,సురక్షిత రవాణా ప్రమాణాలు, నిర్వహణ పారదర్శకత, డిజిటల్ సమన్వయం
సమయోచిత మార్గ ప్రణాళిక, కేంద్రిత, నియంత్రణ వ్యవస్థ, సేవల మానిటరింగ్ వ్యవస్థ వంటి లండన్ మహా నగరం లోని టీఎఫ్ఎల్ మాదిరిగా అత్యాధునిక సాధనాలతో ప్రతి విద్యార్థి ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షించనున్నామని వివరించారు. ఈ వాహనాలకు సీసీటీవీ లను అనుసంధానం చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు.
”ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ (టి. ఎఫ్. ఎల్ ) నమూనాను స్ఫూర్తిగా తీసుకుని, సైబరాబాద్‌లో ఈ సురక్షిత రవాణా వ్యవస్థను రూపొందిస్తున్నాం. అంతర్జాతీయ నగరాల్లో ఉన్నట్లుగానే సాంకేతికత, సమన్వయంతో కూడిన పటిష్టమైన యంత్రాంగాన్ని ఇక్కడ విద్యార్థుల కోసం అమలు చేయబోతున్నాం” అని తెలిపారు.
2026 జూన్ నెల నూతన విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే నాటికి అందరి భాగస్వామ్యంతో ఈ ప్రజారవాణ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు.
ఈ సమావేశంలో ట్రాఫిక్ డీసీపీలు రంజన్ రతన్ కుమార్, శేషాద్రిని రెడ్డి, ఏడీసీపీ హనుమంతరావు, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నవీద్ ఖాన్ మరియు సాంకేతిక నిపుణులు విజయ్ గణగం, అల్ఫ్రెడ్, అభినవ్, మనీష్ పాల్గొన్నారు.