Take a fresh look at your lifestyle.

ఆలయాలను కూడా వదలని రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి-మాజీ మంత్రి హరీష్ రావు

 

*పోలీసులు, రెవెన్యూ అధికారులతో భయాందోళనలు సృష్టిస్తున్నారు

*రేవంత్ రెడ్డి అల్లుడి క్రషర్ దందా కోసం దేవుడి భూములను లాక్కుంటారా

*కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అంటే.. గుళ్లు, గోపురాలు కూల్చడమేనా

*ఆలయానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది: మాజీ మంత్రి హరీష్ రావు

 

ముద్ర ప్రతినిధి, బండ్లగూడ:

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లతో పాటు ఇప్పుడు దేవాలయాలు, మఠాలను సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ల హరీష్ రావు మండిపడ్డారు. కోకాపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…..
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన తయారైంది అన్నారు. అడ్డగోలు వ్యవహారాలకు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారిందని మండిపడ్డారు.
2019లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు.పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి 1 కోటీ 5 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే విషయాన్ని గుర్తు చేశారు. అలాగే హెచ్ఎండీఏ కు రూ. 23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారన్నారు.ఇక్కడ అద్భుతమైన శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయం, గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠశాల నిర్మించారన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల సమక్షంలో పెద్ద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో శారద పీఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారన్నారు.కనీసం నోటీసులు ఇవ్వకుండా నిన్న రాత్రి 11:30 గంటలకు వందలాది మంది పోలీసులు, ఎంఆర్వోలు వచ్చి ఆలయం వద్ద పీఠాధిపతిని, నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులతో మాట్లాడే కనీస సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదా.. అని అసహనం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చావు, ఖమ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డున పడేశావు, నీ పాలనలో అంతా కూల్చడమే తప్ప, పేదల కోసం నిర్మాణాలు చేసే ఉద్దేశమే లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లుళ్ల కోసం కేటాయింపులు, బెదిరింపులు….
అల్లుళ్లకు అక్రమ దారిలో 17 ఎకరాలు కేటాయించి, వారి వద్ద కంకర కొనకపోతే భవనాలకు అనుమతులు ఇవ్వను అని బెదిరిస్తున్నారని హరీష్ రావు. కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ.. కేసీఆర్ గారు కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమేనా రేవంత్ రెడ్డి ఉద్దేశం అని ప్రశ్నించారు. వాటర్ ఫాల్స్ కోసం కేటాయించడానికి దేవాలయ భూములే కనిపించాయా పక్కనే ఉన్న స్థలాలు కనిపించలేదా అన్నారు.

 

వాటర్ వర్క్స్ HMWSSB కోసం ఈ స్థలం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. పక్కనే ఉన్న ఆ 17 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ అక్రమంగా కట్టబెట్టారన్నారు. సమాచార హక్కు చట్టం కింద తానే స్వయంగా అడిగితే ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఇది. 10 ఎకరాలు ఇస్తే వాళ్లు 17 ఎకరాలు కబ్జా చేశారన్నారు. బహిరంగ వేలం వేస్తే ప్రభుత్వానికి వందల కోట్లు వచ్చేవి,కానీ లోపల లోపల నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు.
హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్ కు కిలోమీటరు లోపల ఎలాంటి క్రషర్లు ఉండకూడదు,కానీ రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం ఇక్కడ ఏకంగా 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారన్నారు.
అల్లుడికి వ్యాపారం చేసుకోవడానికి 17 ఎకరాలు ఇస్తావు కానీ.. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శారద పీఠానికి ఉన్న రెండు ఎకరాలను మాత్రం లాక్కుని కూలుస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉదయం నేను ఇక్కడికి వస్తున్నానని తెలియగానే పోలీసులు, ఆర్ఐ, తహసీల్దార్ అందరూ దొంగల్లా పారిపోయి దాచుకోవాల్సిన అవసరం ఏముంది అన్నారు.
దేవుని మీద పడ్డవాడు ఎవడూ బాగుపడలేదని నీకేదో పోయే కాలం దాపురించిందని ఆ దేవుడి శాపం నీకు తప్పక తగులుతుంది అన్నారు.
క్యాబినెట్‌లో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు దయచేసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఈ దేవాలయాన్ని, మఠాన్ని కూల్చకుండా కాపాడాలన్నారు.
లేనిపక్షంలో ఈ దేవాలయ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.