మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి దంపతులు మరోసారి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (2025-26)లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 151 మంది విద్యార్థులకు మొత్తం రూ.24,50,000 నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలను అందజేశారు.
మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజ్‌గోపాల్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.25,000, ద్వితీయ స్థానం వారికి రూ.15,000, తృతీయ స్థానం వారికి రూ.10,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తులో పదిమందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పేదింటి విద్యార్థుల చదువుకు చేయూతనివ్వడం తమ కుటుంబ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. తమ వద్ద ఉన్నదాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని, తాను బడిని గుడితో సమానంగా చూస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను తప్పనిసరిగా ప్రోత్సహించాలని, వారి తల్లిదండ్రులకు అండగా నిలవాలని సూచించారు. విద్య, వైద్యం సమాజానికి రెండు కళ్లులాంటివని, వాటి అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని అన్నారు.
విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ వంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకోసం మాత్రమే బ్రతకడం గొప్ప కాదని, మన చుట్టూ ఉన్నవారి కోసం బ్రతకడమే నిజమైన గొప్పతనమని అన్నారు.
గత ఏడాది కూడా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల 189 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈసారి ఇంటర్ విద్యార్థులకు కూడా అదే స్ఫూర్తితో సహాయం అందించామని తెలిపారు. ఈ సహాయంతో పేద తల్లిదండ్రుల్లో పిల్లలను బాగా చదివించాలనే ధైర్యం పెరిగిందని, విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సన్మానాలు అందుకున్న విద్యార్థులు భవిష్యత్తులో తాము కూడా ఎదిగి సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా నిలుస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.