Take a fresh look at your lifestyle.

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు- ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో జాగృతి అధ్యక్షురాలు కవిత

వారిద్దరి పాలనలో ఉద్యమకారులు, అమరవీరులకు అన్యాయం
సోయి లేని రేవంత్ సీఎం కావడం దురదృష్టం
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వదలిపెట్టం
ఉద్యమకారుల బిడ్డలకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి సీఎం కావటం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాబోయే బడ్జెట్‍లో నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా ప్రకటించకుంటే ఊరుకునేది లేదన్న కవిత.. ఈ హెచ్చరిక సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రొఫెసర్ కోదండరామ్‍కూ వర్తిస్తుందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి రేవంత్ రెడ్డితో కలవటంతోనే తనతో పాటు ప్రజలందరూ కాంగ్రెస్‍ను నమ్మారన్నారు. అయినా కాంగ్రెస్ అధికారంలో వచ్చి రెండున్నరేళ్లయినా ఉద్యమకారుల విషయంలో వారిద్దరు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి‍ని బిల్డింగ్ బయటికి గుంజుతామన్నారు. శ్రీ కృష్ణుడు సైతం ధర్మం వైపు ఉండాలని చెప్పారన్నారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉంది. వారి కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నిజానికి రాష్ట్రం రాగానే ఉద్యమకారులందరికీ మొదటి వరుసలోనే గౌరవం, ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు వస్తాయని భావించామన్నారు. కానీ ఆ విధంగా జరగకపోవటం చాలా బాధ కలిగించే అంశం అన్నారు. మన తెలంగాణ అనేది నిత్యం పోరాటాల గడ్డ అన్ని చెప్పారు. కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహాం పెట్టాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను ఎన్నోసార్లు కోరానన్నారు.అయినా ట్యాంక్ బండ్ పై కూడా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో చేదు అనుభవాలే..
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్లు ఉద్యమం అనే అగ్గి పుట్టాక 2001లో కేసీఆర్ పార్టీ పెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని కవిత చెప్పారు. 1995లోనే వరంగల్ డిక్లరేషన్‍తో మలిదశ ఉద్యమం మొదలైందని ఈ ఉద్యమంలో మారోజు వీరన్న, గద్దర్ లాంటి ఎంతోమంది విప్లవకారులు, ప్రజాసంఘాల నాయకులు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు కవిత వెల్లడించారు పదేళ్లు బీఆర్ఎస్ కు ఉద్యమకారులు అధికారం ఇస్తే అన్ని చేదు జ్ఞాపకాలే మిగిలాయన్నారు. ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఈ విషయంలో ఉద్యమకారులు బయట ఉండి బాధపడితే తాను బీఆర్ఎస్‍లో ఉండి బాధపడ్డానన్నారు. మనవాళ్లే గాయం చేయటంతో నొప్పి ఎక్కువగా ఉంది. ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించారు. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అన్నారు. అహంకారం, సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, మంచితనం, సహనశీలత, భోళాతనం తెలంగాణ తత్వం అన్నారు. అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లేనని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.