ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం రేపింది. మండలానికి చెందిన రైతు తాళ్ళ వెంకటస్వామికి చెందిన ఫామ్‌లో సుమారు 4,500 కోళ్లు మృతి చెందడంతో ఆందోళన నెలకొంది.
సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీగా కోళ్లు చనిపోవడంతో రైతు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నాడు. సమాచారం అందుకున్న జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ జ్ఞానశేఖర్ మంగళవారం ఫామ్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఆయనతో పాటు మండల పశువైద్యాధికారిణి డాక్టర్ కల్పన కూడా పరిశీలనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సందర్శన సమయంలో కొద్దిమంది చనిపోయిన కోళ్లు మాత్రమే కనిపించాయని తెలిపారు. మృత కోళ్ల నమూనాలను సేకరించి పరీక్షల కోసం మహబూబ్‌నగర్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే వ్యాధి కారణాన్ని ఖచ్చితంగా చెప్పగలమని స్పష్టం చేశారు.
ఈ ఘటనతో భారీ నష్టాన్ని ఎదుర్కొన్న రైతు తాళ్ళ వెంకటస్వామి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామ సర్పంచ్ బెట్టరీ రేణుక నాగరాజు విజ్ఞప్తి చేశారు.