అవినీతి రహిత పురపాలక సంఘంగా తీర్చి దిద్దండి
సూర్యాపేట పురపాలక సంఘాన్నిఅవినీతి రహిత పురపాలక సంఘంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవుపలికారు.
గతంలో సూర్యాపేట పురపాలక సంఘంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా నూతన పాలక మండలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు.
నూతనంగా ఎన్నికయిన సూర్యాపేట పురపాలక సంఘం ప్రతినిధులు శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
48 వార్డులకు గాను 31 స్థానాలలో విజయం సాధించిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారి మీద ఉన్న సూర్యాపేట పట్టణం ఇప్పటివరకు ఊహించిన మేరకు అభివృద్ధి సాధించ లేక పోయిందన్నారు.
పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చూపిన ఆదరణ అనన్య సామాన్యమైనదని,ప్రజలు మనమీద అపారమైన నమ్మకంతో గురుతర బాధ్యత మోపారని వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు పని చేయాలని ఆయన ఉపదేశించారు.
జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా సూర్యాపేట పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
ఎప్పటికప్పుడు పట్టణాభివృద్ధిపై సమీక్షించుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు కార్యాచరణ పధకాన్ని రూపొందించుకుండమన్నారు.
అందుకు సరిపడా నిధులు తెచ్చి సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,ఏ.ఐ.సి.సి సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి,సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి,పిసిసి కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు లతో పాటు నూతనంగా ఎన్నికయిన కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.