వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లె తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి, వర్షం కురుస్తున్నప్పటికీ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు బోర్‌వెల్ తవ్వకాలకు భూమిపూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
అనంతరం రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్‌ను ప్రారంభించి విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తదుపరి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందుతున్న భోజనం నాణ్యత, విద్యా బోధనపై ప్రత్యేకంగా ఆరా తీశారు. విద్యార్థులకు భోజనం, చదువు విషయంలో ఎలాంటి లోపాలు, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పాఠశాల ప్రిన్సిపాల్‌కు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.