మహాదేవపూర్, ముద్ర:
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు భరోసా నిధులు విడుదల చేసే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యేలా చూడాలని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో కోరారు. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు మేడిగడ్డ, కాళేశ్వరం సందర్శించనున్నారు. అనంతరం కాటారం మండలం నస్తూరిపల్లిలో రైతు సోదరుల కోసం నిర్వహించే కార్యక్రమంలో రైతు భరోసా రెండో విడత నిధులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులతో కలిసి జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని మన జిల్లా నుంచి ప్రారంభించడం గర్వకారణమని తెలిపారు.
ఇదే సందర్భంలో నస్తూరుపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,ఎఎస్పీ నరేష్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, కౌన్సిలర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.