అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం..జగిత్యాల జిల్లాలో అంగన్ వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీలో మంత్రి అడ్లూరి..
రాష్ట్రంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..
జగిత్యాల:
కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో అంగన్ వాడి టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలోని అంగన్ వాడి టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో తొలి రోజు రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని అన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నరని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకివ్వడం, స్వయం ఉపాధి కోసం పెట్రోల్ బంక్ లో ఏర్పాటు, సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అన్నారు.
అంగన్ వాడి టీచర్లు తల్లి బిడ్డల క్షేమం కోసం పనిచేయాలని మంత్రి కోరారు. ప్రస్తుతం అంగన్వాడి సేవలను ఆన్లైన్ ద్వారా అందించడానికి ప్రభుత్వం అంగన్ వాడి టీచర్లను సెల్ ఫోన్లు అందిస్తుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అంగన్ వాడిలు తీసుకోవాలని మంత్రి కోరారు. జగిత్యాల జిల్లాలోని అంగన్ వాడి టీచర్లకు త్వరలో కంటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.